Teacher Died: పదో తరగతి మూల్యాంకనం కేంద్రంలో విషాదం.. ఉపాధ్యాయుడు మృతి - ఏపీ న్యూస్
Teacher Died in Bapatla: బాపట్లలో పదో తరగతి పరీక్షా పత్రాలు మూల్యాంకనం చేయటానికి వచ్చిన ఉపాధ్యాయుడు మరణించటంతో విషాదం నెలకొంది. పర్చూరు మండలం పర్చూరు వైఆర్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు.. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం కోసం వచ్చారు. ఒక్కసారిగా బీపీ పెరిగి అస్వస్థతకు గురైన శ్రీనివాసరావుని.. సహచర ఉపాధ్యాయులు హుటాహుటిన బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత.. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలిస్తుండగా అప్పికట్ల వద్ద మృతి చెందారు.
శ్రీనివాసరావు మృతి పట్ల.. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాల వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. పదో తరగతి మూల్యాంకన విధులకు వచ్చిన ఉపాధ్యాయుడు మృతి చెందడంపై ఆందోళన చేపట్టారు. ఆరోగ్యం బాగా లేకున్నా.. విధులు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆరోగ్యం బాగా లేని ఉపాధ్యాయులకు మూల్యాంకన బాధ్యతలు ఉండవని బాపట్ల డీఈవో ఉపాధ్యాయులకు సర్దిచెప్పారు. పరిక్షాపత్రాల మూల్యాంకనం పూర్తి చేయటానికి గడువు తక్కువగా ఉండటం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని డీఈవో వారికి వివరించారు. అయినప్పటికీ అనారోగ్యంగా ఉన్నవారికి పేపర్లు దిద్దమని చెప్పటం లేదన్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. శ్రీనివాసరావు మృతి పట్ల తోటి ఉపాధ్యాయులు సంతాపం తెలియజేశారు.