వేధింపులతో టీడీపీ ఎస్టీ విభాగం నేత ఆత్మహత్య - సెల్ఫీ వీడియోలో వివరాలు - TDP ST wing leader committed suicide
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 10:31 PM IST
|Updated : Nov 6, 2023, 10:47 PM IST
TDP ST wing leader committed suicide: ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు అజ్మీరా ప్రసాద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న గోపాలపురం గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన.. అజ్మీరా ప్రసాద్‌ను విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తన చావుకు అదే గ్రామానికి చెందిన తిరుపతి భూలక్ష్మి, భూక్యా తిరుపా, ఎ కొండూరు ఎస్సై రాజులపాటి అంకారావు కారణమని ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. ఎ కొండూరు పోలీస్ స్టేషన్ ముందు గిరిజనులు ఆందోళనకు దిగారు. వారి నిరసనలతో ఎ కొండూరు పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అజ్మీరా ప్రసాద్ నాయక్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతి భూలక్ష్మి, భూక్యా తిరుపా, ఎ. కొండూరు ఎస్సై రాజులపాటి అంకారావు తనను మానసికంగా హింసించడం వల్లే తాను చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో అజ్మీరా ప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. తన బాధను అర్థం చేసుకుని.. వేధింపులు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని సెల్ఫీ వీడియోలో వెల్లడించారు.