ఓటరు జాబితా అవకతవకలపై జాతీయస్థాయిలో పోరాడాలని టీడీపీ నిర్ణయం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 10:26 PM IST
TDP Political Action Committee Meeting in Hyderabad: హైదరాబాద్లోని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నివాసంలో... నారా లోకేశ్ అధ్యక్షతన తెలుగుదేశం రాజకీయ కార్యాచరణ కమిటీ (Political Action Committee) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణ, నక్కా ఆనంద్ బాబు, వంగలపూడి అనిత... తదితర నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై టీడీపీ రాజకీయ కమిటీలో చర్చించారు. ఓటరు లిస్టు అవకతవకలపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని కమిటీ నిర్ణయించింది. జగన్ సర్కారు దోపిడీ, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని సూచించింది.
వైసీపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటాలకు కార్యాచరణ రూపకల్పన చేయాలని పీఏసీ (PAC) నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇసుక, మద్యం, కరవు, ధరలు, ఛార్జీల పెంపు అంశాలపై ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిచాలని నిర్ణయం తీసుకుంది. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమంపై సమావేశంలో చర్చించింది. టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనపై రేపటి సమావేశంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.