Chenetha Website: చేనేతల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించిన నారా లోకేశ్ - Nara Lokesh new Website Opening
Lokesh launched www.weaversdirect.in website: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేటి 'యువగళం' పాదయాత్రలో చేనేత నేత కార్మికుల కోసం ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆ వెబ్‌సైట్ ద్వారా చేనేతలు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేందుకు వీలు కల్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో 30 వేల మందికిపైగా ఉన్న చేనేత వృత్తి కళాకారుల సమస్యలను గమనించిన లోకేశ్.. చేనేత రంగ నిపుణులతో కలిసి రూపొందించిన వెబ్‌సైట్‌ను.. జరీ చీరలకి ప్రసిద్ధి చెందిన వెంకటగిరిలో ప్రారంభించారు.
చేనేత ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవకాశం.. యువనేత నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర 134వ రోజుకు చేరింది. నేటి పాదయాత్రను ఆయన తిరుపతి జిల్లా వెంకటగిరి శివారు కమ్మపల్లె నుంచి ప్రారంభించారు. పాదయాత్రకు ముందు యువనేత లోకేశ్.. చేనేత రంగ నిపుణులతో కలిసి రూపొందించిన www.weaversdirect.in అనే వెబ్‌సైట్‌ను లోకేశ్ ఆవిష్కరించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా చేనేతలకు శిక్షణ, మార్కెటింగ్‌కు అవకాశంతోపాటు దాదాపు 5 లక్షల మంది నేత కార్మికులకు ఉపాధి కల్పనకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు లోకేశ్ తెలిపారు. అంతేకాకుండా, ఇక నుంచి చేనేత కార్మికులు దళారుల బారిన పడకుండా తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవకాశం కల్పించామన్నారు. అనంతరం కమ్మపాలెం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. వెంకటగిరి పాతబస్టాండ్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని.. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.