Lokesh Selfie Challenge: కొనసాగుతున్న సెల్ఫీ ఛాలెంజ్.. అధికార పార్టీకి లోకేశ్ మరో సవాల్..
Lokesh Selfie Challenge: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలో సెల్ఫీ ఛాలెంజ్‌ను కొనసాగిస్తున్నారు. కరవు సీమలో కళకళలాడుతున్న కోడుమూరు నియోజకవర్గం గార్గేయపురం శివార్లలో ఉన్న జలాశయం వద్ద.. ఆయన సెల్ఫీ దిగి అధికార పార్టీకి సవాల్ విసిరారు. కొండల్లో నుంచి వచ్చే వర్షపు నీటికి చెక్‌డ్యామ్ నిర్మాణం ద్వారా అడ్డుకట్టవేసి, సుందరమైన సరస్సుగా.. చంద్రబాబు మార్చారని ఆయన గుర్తుచేశారు. హంద్రీ నది చెంతనే ఉన్నా జగన్ మాత్రం గుక్కెడు నీళ్లివ్వలేదని.. వర్షపు నీటిని ఒడిసిపట్టి రాయలసీమకు జల కళ తెచ్చిన అపర భగీరథుడు చంద్రబాబు అని ఆయన కొనియాడారు. తమ హయాంలో ఈ ప్రాంతంలో ఆహ్లాదమైన బోటింగ్ ఏర్పాటు చేసి, టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేశామని ఆయన అన్నారు. చంద్రబాబు దార్శనికతకు ఇదొక మచ్చుతునక మాత్రమేనని లోకేశ్ పేర్కొన్నారు. లోకేశ్ పాదయాత్ర బుధవారం 95వ రోజుకు చేరుకుంది. ఈ రోజు నందికొట్కూరు నియోజవర్గంలో యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఉదయం గార్గేపురం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. అల్లూరులోని 12 వందల మైలు రాయిని లోకేశ్ చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం నందికొట్కూరులోని ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ వద్ద బహిరంగసభ నిర్వహించనున్నారు.