హామీల అమలులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫెయిల్: కనకమేడల - TDP MP Kanakamedala
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 6:41 PM IST
TDP MP Kanakamedala Ravindra Kumar Fires on CM Jagan: 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసకరం, నియంతృత్వం, అవినీతి, అబద్ధాలమయమని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. పోలీస్ వ్యవస్థతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన నష్టమే ఎక్కువ అని తెలిపారు. రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం 15 ఏళ్లు పడుతుందన్నారు.
2024 ఎన్నికల్లో టీడీపీ - జనసేన ప్రభుత్వాన్ని గెలిపించి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రానికి విముక్తి అని, ప్రజలకు సంతోషమని వెల్లడించారు. 99 శాతం హామీలు అమలు చేశామంటూ ప్రజల్ని మోసగించడం కాదని, టీడీపీ ప్రశ్నలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కనకమేడల డిమాండ్ చేశారు. 85 శాతం హామీల అమల్లో ఫెయిల్ అని టీడీపీ ముద్రించిన పుస్తకంలోని అంశాలపై వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అంటూ కనకమేడల రవీంద్రకుమార్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.