TDP MLC Ashok Babu On CAG Report: వైసీపీ అసమర్థ పాలనకు కాగ్ నివేదికే నిదర్శనం: ఎమ్మెల్సీ అశోక్ బాబు - కాగ్ నివేదిక
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 9:36 PM IST
TDP MLC Ashok Babu On CAG Report: కాగ్ తాజాగా ఇచ్చిన రెండు నివేదికలు వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనను.. జగన్ రెడ్డి దుర్మార్గాలను ఎత్తిచూపాయని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడానికి జగన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని చెప్పడానికి కాగ్ తాజాగా బయటపెట్టిన రెండు నివేదికలే సాక్ష్యమన్నారు. కాగ్ నివేదికలపై అసెంబ్లీలో సమాధానం కూడా చెప్పకుండా వైసీపీ సర్కార్ తప్పించుకోవడం జగన్ రెడ్డి భయానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కాగ్ నివేదికలపై స్పందించాల్సిన మంత్రి బుగ్గన నోరెత్తకపోవడంపై మండిపడ్డారు.
రాజధాని అమరావతిలో 2014–2019 మధ్య జరిగిన పనులన్నీ.. నేటికీ ఎక్కడివక్కడే నిలిచిపోవడంపై కాగ్ ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కాగ్ అన్నా.. న్యాయస్థానాలన్నా.. ఎఫ్ఆర్బీఎం యాక్ట్ అన్నా లెక్క లేదని మండిపడ్డారు. ఏ చట్టాలూ.. ఎవరూ తమనేమీ చేయలేరన్న దుర్మార్గపు విధానాలతో ఈ ప్రభుత్వం ముందుకెళుతోందని దుయ్యబట్టారు. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పాటు చేయాల్సిన స్థానిక సంస్థల పాలనా కమిటీలకు తిలోదకాలిచ్చి మరీ వైసీపీ ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుపట్టిందని తెలిపారు. 30 వేలకోట్ల విలువైన అమరావతి ప్రాజెక్టుల్ని నాశనంచేసి తన సైకో మనస్తత్వాన్ని ముఖ్యమంత్రి మరోసారి బయటపెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.