'కేవలం ఒక్క తడికి నీళ్లడుగుతున్నా సర్కారుకు మనసు రావడం లేదు' - రైతులతో కలిసి పయ్యావుల ఆందోళన - సాగునీటి కోసం అనంతరపురం జిల్లా రైతుల ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 3:49 PM IST
TDP MLA Payyavula Keshav Agitation For Irrigation Water: గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ రైతులతో కలిసి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు. ఉరవకొండ మండలం మూస్తూరు వద్ద గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రైతులతో కలిసి అక్కడే బైఠాయించారు. పంట చివరిదశలో ఉన్నందున ఒక్క తడికి నీరివ్వాలని డిమాండ్ చేశారు. జీబీసీ కాల్వకు నీటిని నిలిపివేయడంతో 30 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలు ఎండిపోవడం వల్ల రైతులు 300 కోట్ల రూపాయల విలువైన పంటలను నష్టపోతున్నారని వాపోయారు. అప్పులు తెచ్చి మరీ పండించిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న హంద్రీనీవా ద్వారా నీరు వృథాగా చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకుపోతున్నారన్నారు. కేవలం రాజకీయాల ప్రచారం కోసమే ఈ నీటిన తరలిస్తున్నారని ఆరోపించారు. ఇలా నీళ్లు తరలించుకుపోతుంటే రైతులు రగిలిపోతున్నారని, రైతులు నష్టపోతున్నా ఈ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. కాల్వ నిండా నీరు వెళ్తున్నా ఒక్క తడి ఇవ్వలేరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.