తాడేపల్లికి చేరిన వేల కోట్లపై నోరు విప్పే ధైర్యం వాసుదేవారెడ్డికి ఉందా?: ఏలూరి సాంబశివరావు - లేబుల్ రిజిస్ట్రేషన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 4:49 PM IST
TDP MLA Eluri Sambasivarao On Liquor Policy : జగన్ మద్యం దోపిడీకి అన్నీ తానై సహకరిస్తున్న వాసుదేవారెడ్డి.. టీడీపీ హయాంలో మద్యం పాలసీలో తప్పులున్నాయని, చంద్రబాబు తప్పుచేశాడని చెప్పడం సిగ్గుచేటని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అమ్ముతున్న జేబ్రాండ్ కల్తీమద్యం అమ్మకాలు.. నగదు లావాదేవీలు.. తాడేపల్లికి చేరిన వేలకోట్లపై నోరు విప్పే ధైర్యం వాసుదేవారెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీ అటు వినియోగదారుడికి, ఇటు మద్యం తయారీ సరఫరాదారులు... దుకాణాదారులతో పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేలా ఎంతో పారదర్శకంగా అమలైందని స్పష్టం చేశారు. మద్యం టెండర్లు పిలవడం మొదలు డిస్టిలరీల ఎంపిక దుకాణాల కేటాయింపు ఇతరత్రా వ్యవహారాలన్నీ నాటి ప్రభుత్వం ఐఏఎస్ అధికారులు, రిటైర్జ్ చీఫ్ జస్టిస్‌లు, చార్టెడ్ అకౌంటెంట్స్‌తో కూడిన కమిటీల సూచనలతోనే చేసిందని గుర్తు చేశారు.
ప్రివిలేజ్ ఫీజు తగ్గించారనే ఆరోపణ పచ్చి అబద్ధం.. ప్రివిలేజ్ ఫీజుకి సంబంధించి నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఖజానాకు రూ.1800కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. చిన్నచిన్న మద్యం వ్యాపారులు నష్టపోతామని విజ్ఞప్తి చేసినందునే నాటి ప్రభుత్వం ప్రివిలేజ్ ఫీజు తగ్గించింది తప్ప.. ఎలాంటి స్వప్రయోజనాలు ఆశించి కాదని వెల్లడించారు. ఎన్నికల సమయంలో లేబుల్ రిజిస్ట్రేషన్ల కోసం కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారనడం కూడా అవాస్తవమేనని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వం అప్పటికే మద్యం దుకాణాల లైసెన్స్ పొందిన వారు ఎవరైనా సరే, ప్రభుత్వానికి లక్ష పూచీకత్తు సమర్పించి లేబుల్ రిజిస్ట్రేషన్ పొందే వెసులు బాటు కల్పించింది. అదే తప్పు అయితే మరి వైసీపీ ప్రభుత్వం దాదాపు 100కు పైగా మద్యం బ్రాండ్లకు ఎలా అనుమతి ఇచ్చిందో జగన్ రెడ్డి, వాసుదేవరెడ్డి సమాధానం చెప్పాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.