TDP Mahanadu Meeting : జన జాతర.. మహానాడు మహోత్సవంలో కదం తొక్కిన పసుపు సైన్యం - తూర్పుగోదావరిలో టీడీపీ మహానాడు సమావేశం
TDP Mahanadu Meeting: తెలుగుజాతి ఔన్నత్యాన్ని, ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన యుగపురుషుడు.. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకు నాంది పలికిన మహనీయుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించే మహానాడు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే విధంగా కొనసాగుతోంది. టీడీపీ నేతలు చెప్పిన్నట్లుగానే తూర్పుగోదావరి జిల్లా రాజమహేమంద్రవరంలో ఈ 41వ మహానాడును చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా నిర్వహిస్తున్నారు. దీనికి నిదర్శనంగా రాజమహేంద్రవరం పసుపు సంద్రమైంది. తెలుగుదేశం మహానాడుకు..పసుపు సైన్యం కదంతొక్కింది. రాష్ట్ర నలుమూల నుంచి కార్యకర్తలు కెరటాల్లా పోటెత్తారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా... నిర్వహించిన మహానాడుకు తరలివచ్చారు. వేమగిరిలోని సభా ప్రాంగణాన్ని... ప్రజలు, కార్యకర్తలు పసుపుమయం చేశారు. ఎండను, గాలి వానను లెక్కచేయకుండా.. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం అనే నినాదాలతో హోరెత్తించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముంగిట నిర్వహించిన మహానాడులో ఎన్నికల కదనోత్సాహం కనబడుతోంది.