Tdp Leaders Visit Achutapuram ప్రభుత్వ అసమర్థత వల్లే అచ్యుతాపురం సెజ్‌లో తరచూ ప్రమాదాలు: టీడీపీ నేతలు - TDP leaders visited injured victims
Tdp Leaders Visit Victims:అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మా ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రులు.. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే పల్లాశ్రీనివాసరావు.. పరామర్శించారు. సాహితీ ఫార్మా ఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో సుమారు 70 మంది ప్రమాదాల బారిన పడి మృతి చెందారని మండిపడ్డారు. పరిశ్రమలు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విస్మరించడం, సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని పార్టీ నేతలు ఆరోపించారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.