'రాజధాని ప్రాంతంలో మితిమీరిన అక్రమాలు - బాధితులపైనే పోలీసు కేసులు' - political news ap
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 4:38 PM IST
TDP Leaders Protesting The Behavior of The Police in The Capital : రాజధానిలో పోలీసుల తీరును నిరసిస్తూ తుళ్లూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. రాజధాని ఎంపీ నందిగం సురేశ్ ఆగడాలు శ్రుతి మించిపోతున్నాయని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి తుళ్లూరులో నెలకొందన్నారు. రాజధాని ప్రాంతంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై పోలీసులు చర్యలు చేపట్టడం లేదని విమర్శలు గుప్పించారు.
ఎవరైతే ఇది అధర్మం, అక్రమం, అన్యాయని పోలీసులు ఆశ్రయిస్తారో వారినే బాధితులుగా చూపించి చర్యలు తీసుకుంటున్నారని శ్రావణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో భూకబ్జా, ఇసుక తరలింపు, గ్రావెల్ తోడేయడం లాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు రాష్ట్రంలో బతకడానికి అనువైన పరిస్థితులు లేవని పేర్కొన్నారు. సామాన్య ప్రజలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.