TDP Letter to CEO: ఓట్ల జాబితా పరిశీలనలో వాలంటీర్లు.. ఎన్నికల అధికారికి టీడీపీ ఫిర్యాదు - ఎన్టీఆర్ జిల్లా వార్తలు
Volunteers involved in Vote List Scrutiny :ఓటర్ల జాబితా సవరణ మొదలైన మూడో రోజు కూడా చాలా నియోజకవర్గాల్లోని బూత్‌లలో ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదని ఎమ్మెల్సీ అశోక్ బాబు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. కొన్ని చోట్ల సర్వర్ పని చేయట్లేదని, బూత్ లెవల్‌లో అధికారులు హాజరు కావట్లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాక సర్వేలో వాలంటీర్లు కూడా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఇంటింటి సర్వే నిర్వహించకుండా.. కార్యాలయాల్లోనే ఓటర్ల జాబితా సవరిస్తున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల జాబితా పరిశీలన కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొంటున్నారని తెదేపా నేత బొండా ఉమా ఆరోపించారు. ఆ ఘటనలపై ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇదివరకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్ల కలుగజేసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లోబడకుండా పద్ధతిగా ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాలని ఆయన కోరారు.