TDP Leaders Fire on Srikalahasti Rural CI: టీడీపీ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించిన సీఐ.. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా - TDP incharge Sudhir Reddy news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 28, 2023, 6:10 PM IST
|Updated : Oct 29, 2023, 6:28 AM IST
TDP Leaders Dharna at Srikalahasti Rural PS: తెలుగుదేశం పార్టీ నేతల పట్ల కక్షపూరితంగా, దురుసుగా ప్రవరిస్తున్న సీఐ అజయ్ కుమార్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు ధర్నాకి దిగారు. టీడీపీ ఇన్‌ఛార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్ వద్దకు చేరుకుని.. సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అసలు ఏం జరిగిందంటే.. గతకొన్ని రోజులుగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వివాదం జరుగుతుంది. కమ్మ కొత్తూరుకు చెందిన చెంచయ్య నాయుడిపై గ్రామీణ సీఐ అజయ్ కుమార్ దురుసుగా ప్రవర్తించి, అసభ్యకరంగా మాట్లాడాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డి దృష్టికి కార్యకర్తలు తీసుకువచ్చారు. దాంతో ఆయన (సుధీర్‌రెడ్డి) సీఐని ఫోన్‌లో ప్రశ్నించగా.. అసభ్యకరంగా మాట్లాడారు. సీఐ వ్యాఖ్యలపై ఆగ్రహించిన సుధీర్‌రెడ్డి.. కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. 'సీఐని సస్పెండ్ చేసేంత వరకు ధర్నా విరమించబోం. నాతోనే అసభ్యంగా మాట్లాడితే.. ఇక కార్యకర్తల, సామాన్య ప్రజల పరిస్థితేంటి. సీఐ అజయ్ కుమార్ వైసీపీ గూండాల తయారయ్యారు. తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలి' అంటూ సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.