జగన్ కళ్లలో ఆనందం చూడాలన్నదే పొన్నవోలు లక్ష్యం - సీఎస్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు - TDP Complaint on Ponnavolu Sudhakar
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 8:13 PM IST
TDP Leaders Complaint on AAG Ponnavolu Sudhakar Reddy: చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధించడానికే.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని జగన్ నియమించుకున్నారని.. తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి (Chief Secretary Jawahar Reddy)ని తెలుగుదేశం నేతలు కలిసి.. పొన్నవోలు సుధాకర్ తీరుపై ఫిర్యాదు చేశారు. తనకు పనికొస్తాడని మోనార్క్ ఏఏజీ (Additional Advocate General) పొన్నవోలు సుధాకర్ రెడ్డిని జగన్ ఏఏజీగా నియమించుకున్నారని ఆరోపించారు. టార్గెట్ చంద్రబాబు లక్ష్యంతో జగన్‌తో కలిసి పొన్నవోలు ప్రయాణం చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ కళ్లల్లో ఆనందం చూడాలన్నదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి తపన, లక్ష్యమని దుయ్యబట్టారు. చంద్రబాబుపై సాక్ష్యాలు లేని వాటిపై కూడా కేసులు పెట్టారని అన్నారు. దాని కారణంగానే ఏజీ శ్రీరామ్ కంటే.. ఏఏజీ పొన్నవోలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రెస్మీట్లు పెట్టి మరీ ఏఏజీ మాట్లాడుతున్నారని.. తన పరిధి దాటి ప్రవర్తించారని తెలిపారు. అసలు దిల్లీ వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం ఏంటని మండిపడ్డారు.