TDP Leaders Complained about Votes Deletion కాకినాడలో 52 వేల 941 ఓట్లు తొలగించేందుకు దరఖాస్తులు.. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2023, 8:38 PM IST
TDP Leaders Complained about Votes Deletion: కాకినాడ జిల్లాలో తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లను వైసీపీ నాయకులు తొలగిస్తున్నారని తక్షణమే వాటిని నియంత్రించాలంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 52 వేల 941 ఓట్లు తొలగించేందుకు నకిలీ ఫారమ్ 7లను ఆన్లైన్లో దరఖాస్తు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యధికంగా కాకినాడ నగర నియోజకవర్గంలోనే 20 వేల 159 ఓట్లను తలగించేందుకు నకిలీ ఫారమ్7 దరఖాస్తు చేసినట్టు కలెక్టర్కు టీడీపీ నాయకులు చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని అనుచరులు.. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఆన్లైన్లో నకిలీ దరఖాస్తులు పొందుపరిచారని అన్నారు. పిఠాపురం నియోజవర్గంలో 5 వేల 734 ఓట్లను తొలిగించేందుకు దరఖాస్తు చేశారన్నారు. తప్పుడు చర్యలకు అధికారులు సహకరించడంవల్ల వారే బలవుతారని గుర్తించాలని చెప్పారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి కాకినాడ జిల్లా పరిధిలో ఓటర్ జాబితా నుంచి తొలగించిన పేర్లను తిరిగి చెల్లుబాటు అయ్యేలా చూడాలని ఎన్నికల కమిషనర్‌ని టీడీపీ నాయకులు కోరారు.