TDP leaders Comments on Undavalli Arun Kumar: వైసీపీ అవినీతి ఉండవల్లికి కనిపించడం లేదా..?: బుచ్చిరామ్ ప్రసాద్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 8:17 PM IST
TDP leaders Comments on Undavalli Arun Kumar: సీఐడీకి అండగా నిలవాలి, రాష్ట్రప్రభుత్వ పరువు ప్రతిష్టలు కాపాడాలనే... ఉండవల్లి అరుణ్ కుమార్ స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంపై హైకోర్టులో పిల్ వేశాడని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండానే చంద్రబాబుని అక్రమంగా జైలుకు పంపిన విషయం ఉండవల్లికి తెలియదా అని నిలదీశారు. ఉండవల్లి నిజంగా ప్రజల ఆస్తులకు కాపలాదారు అయితే వాటిని దోచుకుంటున్న దొంగల్ని వదిలేసి, ఆవుల్ని చూసి అరవడం ఏమిటి అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలోజరుగుతున్న అరాచకాలు, వైసీపీ ప్రభుత్వ అవినీతి ఉండవల్లికి ఎందుకు కనిపించడం లేదని అని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ సర్కార్ దోపిడీకి సంబంధించిన ఆధారాలు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఆధారాలతో కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేసే ధైర్యం ఉండవల్లికి ఉందా అని సవాల్ విసిరారు. అనేక చిట్ ఫండ్ కంపెనీల అక్రమాలుంటే, కేవలం మార్గదర్శిపైనే ఉండవల్లి న్యాయస్థానాలకు వెళ్లడం తన వ్యక్తిగత కక్షలో భాగం కాదా అని మండిపడ్డారు.