జగన్‌ను సాగనంపాల్సిన సమయం ఇదే: ఆలపాటి రాజా - భారీ బహిరంగ సభ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 5:41 PM IST
TDP Leaders Arrangements For Tiruvuru Meeting:వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరిస్తూ తిరువూరులో లక్ష మందితో భారీ బహిరంగ సభ జరగబోతుందని తెలుగుదేశం నేతలు వెల్లడించారు. ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునిచ్చారు. 25 పార్లమెంట్ల స్థానాల పరిధిలో ఈనెల 29వ తేదీ వరకు 25 సభలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 7న ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు, 18న గుడివాడలో జరగబోయే సభలను నాయకులు బాధ్యత తీసుకుని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విజయవంతం చేస్తారన్నారని తెలిపారు.
కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ పాలన సాగిస్తున్న జగన్‌ను సాగనంపాల్సిన సమయం వచ్చిందని తెలుగుదేశం నేతలు అన్నారు. రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలని పేర్కొన్నారు. కావున జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు చేపట్టిన జైత్రయాత్రను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరగబోయే "రా కదలిరా” భారీ బహిరంగ సభ ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నేతలు ఆలపాటి రాజా, దేవినేని ఉమా కొల్లు రవీంద్ర పరిశీలించారు.