టిడ్కో ఇళ్లు అప్పగించకుండా జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు: జేసీ ప్రభాకర్ రెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 3:53 PM IST
TDP Leaders Agitation With TIDCO Houses Beneficiaries: డబ్బు చెల్లించిన టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు వెంటనే ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తాడిపత్రిలో ఆందోళన చేపట్టారు. నా ఇల్లు- నా హక్కు నినాదంతో టిడ్కో లబ్ధిదారులతో కలిసి ర్యాలీకి యత్నించారు. ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్త వాతవరణం నెలకొంది.
డబ్బు చెల్లించిన టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు వెంటనే ఇళ్ల పనులు పూర్తిచేసి స్వాధీనం చేయాలని, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు వెంటనే అప్పగించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తాడిపత్రి (Tadipatri) మున్సిపాలిటీతోపాటు, సమీప గ్రామాల నుంచి పెద్దఎత్తున లబ్దిదారులు, టీడీపీ కార్యకర్తలు తరలిరాగా జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి టీడీపీ ఇన్ ఛార్జి జేసీ అస్మిత్ రెడ్డిలు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీగా వెళ్లటానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అప్పటికే భారీగా కార్యకర్తలు ర్యాలీకి రావటంతో భారీగా పోలీసులు మోహరించి, ర్యాలీ ముందుకు వెళ్లనీయలేదు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడిన జేసీ, తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నామని తెలిపారు.
డబ్బు చెల్లించిన లబ్దిదారులకు నిర్మాణం పూర్తైన ఇళ్లు అప్పగించకుండా జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) మోసం చేస్తున్నాడని ఆరోపించారు. లబ్దిదారులకు డబ్బు వెనక్కి ఇవ్వకపోగా, ఇల్లు కూడా అప్పగించలేదని పేర్కొన్నారు. ఇళ్లను అప్పగించే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తాము ఆందోళన చేయాల్సి వచ్చిందని జేసీ పోలీసులకు వివరించారు. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకునే యత్నం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ (TDP) కార్యకర్తలు, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు పోలీసు వాహనానికి అడ్డుగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు పోలీసులు నచ్చచెప్పి తిరిగి వెనక్కి ఇంటికి పంపించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు వెంటనే టిడ్కో ఇళ్లు అప్పగించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.