TDP Leaders Agitation: 'వైసీపీ రివర్స్ పాలనతో.. గుంటూరు 'గుంటలూరు'గా మారింది'
TDP Leaders Agitation: గుంటూరు నగర శివారులోని పలకలూరు రహదారి ధ్వంసమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ తెలుగు యువత వినూత్నంగా ఆందోళన చేపట్టింది. రహదారిపై భారీ గుంతలు ఏర్పడగా.. ఇటీవలి కురిసిన వర్షాలకు వాటిలో నీరు చేరి చిన్నపాటి కుంటల్ని తలపిస్తున్నాయి. దీంతో ఆ నీటిలో తెలుగు యువత నేతలు కాగితపు పడవల్ని, బాతుల్ని వదిలి నిరసన తెలిపారు. రహదారి పాడైపోయి మూడేళ్లయినా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రహదారి విస్తరణ పేరిట ఎన్నేళ్లు పనులు చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ తరహాలో.. రివర్స్ పాలన కొనసాగిస్తూ 'గుంటూరును గుంటలూరు'గా మార్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రహదారులు చెరువులను తలపిస్తున్నాయని.. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వంలో చలనం రావాలని అన్నారు. ప్రభుత్వం స్పందించి రహదారులను బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణతో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.