TDP Leader Yanamala Allageations on YS Jagan: సీఐడీ.. సీఎం జగన్ జేబు సంస్థలా మారింది: యనమల - వైసీపీ వర్సెస్ టీడీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2023, 3:56 PM IST
TDP Leader Yanamala Allageations on YS Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంత అవినీతిపరుడు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని.. ప్రపంచంలోనే ఆయనకు ఉన్న వ్యతిరేకత ఏ నాయకుడికీ లేదని మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (yanamala ramakrishnudu) అభిప్రాయపడ్డారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు, సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు రెండున్నర లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ అని అన్నారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చే వనరుల్ని జగన్ అనుచర వర్గం అంతా దోచుకుంటోందని ఆరోపించారు. మచ్చలేని చంద్రబాబునాయుడిపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ మంచి సంస్థ అని.. అందులో శిక్షణ పొందిన వేల లక్షల మంది నిరుద్యోగులు శిక్షణ పొంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. యువతకు ఆదాయం రాకూడదన్నది జగన్ ఉద్దేశ్యమని.. అందుకే నైపుణ్య అభివృద్ధి సంస్థను నాశనం చేశారని.. కుట్రపూరితంగా చంద్రబాబుని కేసులో ఇరికించారని అన్నారు.
జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం: రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనేది జగన్ ఆలోచన అని యనమల తెలిపారు. అందుకోసమే చంద్రబాబును జైలులో పెట్టి వైసీపీ ప్రభుత్వం బురద చల్లాలని చూస్తోందని యనమల ఆరోపించారు. జగన్‌పై ఉన్న వ్యతిరేకత ప్రపంచంలో ఏ నాయకుడిపైనా లేదని యనమల వెల్లడించారు వైఎస్ జగన్ (YS Jagan) పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని, పోతూ పోతూ.. జైలుకు వెళ్లడం కూడా ఖాయమని యనమల పేర్కొన్నారు. సీఐడీ.. జగన్ జేబు సంస్థలా మారిందన్న ఆయన.. చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారు.. ఏం సౌకర్యాలు కల్పిస్తారంటూ యనమల ప్రశ్నించారు.