బడ్జెట్ ఆమోదం లేకుండా రూ.1400 కోట్లు ఎలా ఇచ్చారు? : తితిదే ఛైర్మన్, అదనపు ఈవోను ప్రశ్నిచిన టీడీపీ - TTD NEWS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 3:32 PM IST
TDP Leader Vijay Kumar on TTD Contract Works: తితిదే (తిరుమల తిరుపతి దేవస్థానం) ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. తితిదేలో అదనపు నిధులు, బడ్జెట్ ఆమోదం లేకుండా సుమారు 1400 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పనులకు ఎలా ఇచ్చారని విజయ్ కుమార్ ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి ఛైర్మన్ కాగానే రూ.1,233 కోట్లకు కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? అని నిలదీశారు.
Vijay Kumar Comments: ''తితిదేలో అదనపు నిధులు లేకుండా కాంట్రాక్ట్ పనులా?. బడ్జెట్ ఆమోదం లేకుండానే రూ.1400 కోట్ల కాంట్రాక్ట్ పనులా?. పరిపాలన అనుమతి ఎలా ఇచ్చారో ధర్మారెడ్డే చెప్పాలి. కరుణాకర్‌రెడ్డి ఛైర్మన్ కాగానే రూ.1,233 కోట్లకు కాంట్రాక్ట్‌లెలా ఇచ్చారు?. అదనపు ఖర్చుకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా?. బడ్జెట్‌లో ఒక ఖర్చు ఆపేస్తేనే కదా రూ.1,233 కోట్లు పెట్టగలరు. తిరుపతి మున్సిపాలిటీకి ఒక శాతం నిధులపై విమర్శలతో ఆపారు. ఇప్పుడేమో శానిటేషన్ పేరుతో రూ.80 కోట్లు ఎలా ఇచ్చారు?. ఇన్ని రోజులు తిరుపతిలో పారిశుద్ధ్యం ఎలా చేశారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను వసూలు చేసే ఇస్తున్నారు కదా. మరిప్పుడు శానిటేషన్ ఖర్చును తితిదే పెట్టడమేంటి?. శానిటేషన్‌పై ఖర్చు పెట్టుకోలేని స్థితిలో తిరుపతి మున్సిపాలిటీ ఉందా?. అదనపు ఈవో, ఛైర్మన్ ఇద్దరూ అనుకుంటే సరిపోతుందా?. హుండీ ఆదాయం కూడా నెలకు రూ.130 కోట్లు దాటట్లేదు. కొత్త నిధులేమీ లేకుండా రూ.1,250 కోట్లకు పనులెలా పిలుస్తారు?. కొత్త ఛైర్మన్ వచ్చారని లడ్డూలు పంచిపెట్టినట్లు పంచుతారా?. ఐదేళ్లలో జరిగిన ఇంజినీరింగ్ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.'' అని టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ ప్రశ్నించారు.