Evidence on Data Theft in AP: వాలంటీర్ల ద్వారా డేటా చౌర్యం.. ఆధారాలు బయటపెట్టిన టీడీపీ నేత నీలాయాపాలెం
TDP Leader Vijay Kumar Released the Evidence on Data Theft: వాలంటీర్ల ద్వారా డేటా చౌర్యం జరుగుతోందంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్.. నేడు అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. ఐ ప్యాక్‌లో ఉద్యోగుల్నే వివిధ రకాల కంపెనీల్లో ఉద్యోగులుగా చూపిస్తూ ప్రభుత్వ డేటా ఇవ్వటంతో పాటు ప్రజల సొమ్మును పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారని ఆరోపించారు. రామ్ ఇన్ఫో లిమిటెడ్, యూనీ కార్పొరేట్ సొల్యూషన్స్, పీకే కార్పొరేట్ సొల్యూషన్స్, ఉపాధి టెక్నో సర్వీసెస్, సిటిజెన్స్ సంస్థల్లో ఉద్యోగులు అందరూ ఐప్యాక్ ఉద్యోగులేనంటూ పలు విషయాలను బహిర్గతం చేశారు.
రామ్ ఇన్ఫో డైరెక్టర్ జయేష్ రావు, పూర్ణదుర్గలు అంతముందు వరకూ ఐప్యాక్ ఉద్యోగేనంటూ పత్రాలను బహిర్గతం చేశారు. ఐప్యాక్ కోర్ టీమ్ మెంబర్ దినేష్ మోరే తూర్పు గోదావరి జిల్లాకు వాలంటీర్లపై ఇన్‌ఛార్జ్‌గా నియమించారని ఆధారాలను వెల్లడించారు. ఈ డేటా చౌర్యానికి 2020 నుంచే ఏటా రూ.69కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ డబ్బుతో ఐ ప్యాక్ ద్వారా చేస్తున్న డేటా సేకరణ తిరిగి వైఎస్సార్సీపీకి చేరుతోందనటానికి ఇంతకంటే ఏం రుజువులు కావాలని నీలాయపాలెం విజయ్ కుమార్ నిలదీశారు.