Viveka murder case: వివేకా హత్యకేసులో సీబీఐ అఫిడవిట్‌పై సీఎం జగన్ నోరు విప్పాలి: వర్ల రామయ్య - వైఎస్ జగన్ పై వర్ల రామయ్య కామెంట్స్
TDP leader Varla Ramaiah: వివేకా హత్యకేసులో సీబీఐ అఫిడవిట్‌పై ముఖ్యమంత్రి జగన్ నోరు విప్పాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వివేకా హత్య విషయం జగన్‌కి అందరికంటే ముందే తెలుసని సీబీఐ అంటోందని వర్గ ఆరోపించారు. వివేకా హత్య కేసులో అన్ని వేళ్లు జగన్, భారతి వైపే చూపిస్తున్నాయని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. మంత్రులు అంబటి రాంబాబుని అడిగినా, రోజాని అడిగినా ముఖ్యమంత్రిని రాజీనామా చేయమంటారని వ్యాఖ్యానించారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబాయి హత్య కేసుపై రాష్ట్ర ప్రజలకు అడుగడుగునా అబద్దాలు చెప్పారని వర్ల రామయ్య అన్నారు. జగన్ చంద్రబాబును ఉద్దేశించి అప్పట్లో ఆరోపణలు చేశారని వర్ల గుర్తు చేశారు. జగన్ అడుగడుగునా అబద్ధాలు అడటానికి కారణం ఏమిటో నేడు అందరికీ తెలుస్తోందని వర్ల విమర్శించారు. ఈ కేసులో ముద్దాయిలను రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. వివేకాను హత్య చేసిన వ్యక్తులు సీఎం జగన్‌కు అత్యంత ఆప్తులు కనకనే... వారిని కాపాడటానికి జగన్ నానాతంటాలు పడుతున్నారని వర్ల రామయ్య ఎద్దేవా చేశాడు.
వివేకా హత్య జరిగిన విషయం ప్రపంచానికి తెలియకముందే జగన్‌కు తెలిసినట్లు సీబీఐ ఆరోపిస్తుందని వర్ల వెల్లడించారు. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ ద్వారా జగన్‌కు, అటెండర్ నవీన్ ద్వారా భారతికి వివేకా హత్య విషయం తెలిసిందా లేదా అనే అంశం వెల్లడించాలని వర్ల డిమాండ్ చేశారు. సీబీఐతో విచారణ కాకుండా కడపలో నిజాయితీ గల ఎస్ఐకి ఈ కేసును బదిలీ చేసినా ఇప్పటివరకు కేసులో నిందితులను అరెస్ట్ చేసేవాడని ఎద్దేవా చేశాడు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ మూడు చెరువుల నీరు తాగే పరిస్థితి నెలకొందని వర్ల విమర్శించారు. అసలైన వారిని అరెస్ట్ చేసేవరకు ఇంకా ఎంత టైం పడుతుందో అని ఎద్దేవా చేశాడు. హూ కిల్డ్ బాబాయి అనే ప్రశ్నకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. జగన్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.