TDP on YSRCP Fake News:రాజకీయ లబ్దికోసం.. ఇంత నీతి మాలిన పనులా!: టీడీపీ నేత వర్ల రామయ్య
YSRCP Spreading Fake News: సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశానికి నష్టం చేకూర్చేలా వైసీపీ కుట్రలు పన్నుతోందని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మండిపడ్డారు. టీడీపీ నేతల్లా వేషాలు వేయించి.. సామాజిక మాధ్యమాల్లో ప్రజలను తిట్టిస్తూ తద్వారా పార్టీకి నష్టం చేకూర్చేలా ప్లాన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు 'ఆర్ఎంకేఆర్ పెగ్స్' పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న రామాల మన్విత్ కృష్ణారెడ్డి టీడీపీ నాయకుడిలా పసుపు షర్ట్, కండువా వేసుకుని.. వెనుక చంద్రబాబు ఫొటో, సైకిల్ గుర్తు పెట్టుకొని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కించపరిచేలా మాట్లాడుతూ వీడియో విడుదల చేయడంలో కుట్ర ఉందని టీడీపీ పాలిటీబ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవ్ రెడ్డి, మన్విత్ కృష్ణారెడ్డి కలసి ఫేక్ వీడియోలతో ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయ లబ్ది కోసం ఆ ఇద్దరితో ఇలాంటి చండాలపు పనులు చేయిస్తున్నారని విమర్శించారు. ఆ నకిలీ వీడియో వ్యవహారంపై సీఐడీకి కంప్లైంట్ చేస్తున్నట్లు చెప్పారు. సీఐడి కేసు నమోదు చేయకపోతే, తగిన రీతిలో ముందుకు వెళ్తామన్నారు.
అనుచిత వ్యాఖ్యలతో టీడీపీని దెబ్బతీసే కుట్ర: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్రెడ్డి అన్నీ దోచిపెడుతున్నారు. వారికే అన్ని పదవులు, పథకాలు ఇస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆ వర్గాలకు మేమంటే ఏంటో చూపిస్తాం' అని కృష్ణారెడ్డి దుర్భాషలాడాడు. 'చదువులు లేకుండా మీరు బతకలేరా? చదువుకుని ఏం చేస్తారు? మేంరా అమెరికా పోవాల్సింది. పెద్ద పెద్ద చదువులు చదువుకునేది మా కులపోళ్లురా' అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అసభ్యపదజాలంతో దూషించాడు. టీడీపీ నాయకుడే మాట్లాడుతున్నాడని ఆ వర్గాలు అనుకొని.. పార్టీపై విద్వేషం పెంచుకోవాలనే ఆ వీడియో విడుదల చేసినట్టుగా కనిపిస్తోంది.
ఎన్నాళ్లీ నీతిమాలిన పనులు?:
'జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్‌రెడ్డి, వైసీపీ నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డి ఫేక్ వీడియోలతో విషప్రచారం చేస్తున్నారు. సజ్జల, ఆయన కుమారుడు ఇంకెన్నాళ్లు ఇలాంటి నీతిమాలిన పనులకు పాల్పడుతారు' అని వర్ల రామయ్య మండిపడ్డారు.