నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌తో రోజుకు 2 వేల టన్నుల క్వార్ట్జ్ దోపిడీ - సీఎం జగన్‌కు, మంత్రులకు వాటా: సోమిరెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 10:03 PM IST
TDP Leader Somireddy Obstructed Illegal Mining: నెల్లూరు జిల్లా పొదలకూరులోని భారత్ మైకా మైన్స్‌లో వైసీపీ నేతలు 3 వారాలుగా అక్రమ మైనింగ్ చేస్తున్నారని, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి మండిడ్డారు. రుస్తుం యజమాని విద్యాకిరణ్‌తో కలిసి సోమిరెడ్డి నిరసన తెలిపారు. రోజుకు 2 వేల టన్నుల క్వార్ట్జ్‌ను దోపిడీ చేస్తున్నారన్నారు. అక్రమ మైనింగ్ ఆపాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. తవ్వకాల్లో సీఎం జగన్‌కు, మంత్రులకు వాటా ఉందని ఆరోపించారు. మంత్రి కాకాణి, వైసీపీ నేత శ్యాంప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోపిడీ సొత్తును రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలని పేర్కొన్నారు. రుస్తుం, భారత్ మైకా గనుల్లో దోపిడీ ఆపేవరకు ఇక్కడే కూర్చుంటామని సోమిరెడ్డి వెల్లడించారు. వందల యంత్రాల సాయంతో మైనింగ్ చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. అధికారులు వచ్చేవరకు వాహనాలను బయటకు వెళ్లనీయం అని పేర్కొన్నారు.
మైనింగ్ అక్రమాలపై రుస్తుం మైనింగ్ కంపెనీ యజమాని విద్యాకిరణ్ మాట్లాడారు. మైనింగ్ ఆపాలని ఈ నెల 7న హైకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ ఆపాలని కోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదని వెల్లడించారు. మైనింగ్ అక్రమాలపై వినతిపత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యాకిరణ్ పేర్కొన్నారు. తమను బెదిరించి మరీ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ చేసేవారిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. అనేక ఇబ్బందుల మధ్య మైనింగ్ చేశామని, రుస్తుం మైనింగ్ కంపెనీ రెన్యువల్ దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే మైనింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు.