Somireddy Comments On Avinash: సీబీఐ అవినాష్ రెడ్డిని పిలిచినప్పుడల్లా.. సీఎం దిల్లీ పర్యటన ఎందుకు? - Bhaskar Reddy
Somireddy Comments On Avinash: న్యాయస్థానాలతో అవినాష్ రెడ్డి ఆటలాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. సీబీఐని కూడా ప్రజలు శంకించే పరిస్థితి వస్తోందని ఆయన అన్నారు. వివేకా హత్యకేసులోనే నిందితులుగా ఉన్న తండ్రీకొడుకుల్లో.. భాస్కర్ రెడ్డి జైల్లో ఉంటే, అవినాష్ రెడ్డి బయట ఉండటమేంటని ప్రశ్నించారు. సీబీఐ అవినాష్ రెడ్డిని పిలిచినప్పుడల్లా సీఎం దిల్లీ పర్యటన ఎందుకు ఖరారవుతోందని నిలదీశారు.
అవినీతిపరుడు, అరాచకవాది చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్న ప్రజల అభిమతం మేరకే పొత్తులు ఉంటాయని సోమిరెడ్డి తెలిపారు. చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లను తిట్టేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో మీటింగ్ లు పెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయంలో సర్వసాధారణమైన పార్టీల మధ్య పొత్తు అంశంపై జగన్మోహన్ రెడ్డిలో అంత కలవరం దేనికని నిలదీశారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా 1977లో దేశంలో జనతా పార్టీ నేతృత్వంలో జనసంగ్, వామపక్ష పార్టీలన్నీ ఒక్కటి కాలేదా అని ప్రశ్నించారు. 1985లో రాష్ట్రంలో బీజేపీ, వామపక్షాలు టీడీపీతో కలిసి కాంగ్రెస్‌ను ఓడించలేదా అని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు అంతా ఒక్కటవుతున్నామన్న పవన్ వ్యాఖ్యలను ప్రజలు స్వాగతిస్తుండటంతో జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లేదని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.