ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అంతా తప్పుల తడక, కుట్రపూరితం! పోస్టులు అమ్ముకోవడానికి వైసీపీ కుట్ర చేస్తోంది: సప్తగిరి ప్రసాద్ - TDP Leader Sapthagiri Prasad
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 5:15 PM IST
TDP Leader Sapthagiri Prasad on APPSC Notification: విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ అంతా తప్పుల తడకగా, కుట్రపూరితంగా ఉందని తెలుగుదేశం నేత సప్తగిరి ప్రసాద్ ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. విశ్వవిద్యాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని మండిపడ్డారు. వర్శిటీ పోస్టులు అమ్ముకోవడానికి వైసీపీ కుట్ర చేస్తుందని సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. వైసీపీ సర్కార్.. విశ్వవిద్యాలయాల్ని వ్యాపార కేంద్రాలుగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు మళ్లించి, రోస్టర్ పాయింట్లను ఇష్టారీతిన మార్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అంతా తప్పుల తడకగా ఉందన్న సప్తగిరి ప్రసాద్.. రోస్టర్ పాయింట్లను ఇష్టారీతిన మార్చే అధికారం ఎక్కడిది అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వం ఇచ్చిన సీఏఎస్ ప్రమోషన్లు అన్నిటిపై విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.