జగన్ వైఫల్యం రాష్ట్రానికి శాపం - విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో వైఫల్యం: పట్టాభి - విదేశీ పెట్టుబడులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 17, 2024, 4:40 PM IST
TDP Leader Pattabhi Alleged CM Jagan : విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని టీడీపీ నేత పట్టాభి రామ్ ఆరోపించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠను జగన్ దిగజార్చారని దుయ్యబట్టారు. తెలుగుదేశం హయాంలో ఐదేళ్లలో 65 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకువస్తే, జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో తీసుకు వచ్చింది కేవలం 6 వేల 679 కోట్లేనని పట్టాభి విమర్శించారు. జగన్ వైఫల్యం రాష్ట్రానికి శాపంగా మారిందని ఆరోపించారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉంటే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయని నిలదీశారు.
విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యాడని, అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠను జగన్ దిగజార్చారని పేర్కొన్నారు. గతంలో దావోస్ అని చెప్పి నేరుగా లండన్‌కు వెళ్లిన ఘనత జగన్‌ది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2015లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు ప్రసంగించారని, 2016, 2017లో దావోస్ సదస్సుకు చంద్రబాబును ఆహ్వానించారని పట్టాభి గుర్తు చేస్తూ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా ఏటా సదస్సుకు హాజరయ్యారని తెలిపారు.