TDP Leader Pattabhi Allegations on Undavalli: ఉండవల్లి వేసిన పిటిషన్ తాడేపల్లి ప్యాలెస్‌లో సిద్ధం చేశారు: పట్టాభి - స్కిల్ డెవలప్ మెంట్ కేసు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2023, 8:17 PM IST
TDP Leader Pattabhi Ram Allegations on Undavalli: తనకు తాను తటస్థుడిగా చెప్పుకునే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముసుగు తీసేసి చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేశారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీబీఐ విచారణ కావాలని హైకోర్టులో ఉండవల్లి వేసిన పిటిషన్ తాడేపల్లి ప్యాలెస్‌లో సిద్ధం చేశారని ఆరోపించారు. పిటిషన్‌కు ఏమేం డాక్యుమెంట్లు జతచేశారో కూడా చూడకుండా సంతకం పెట్టేస్తారా అని ఎద్దేవా చేశారు. రాజమండ్రిలోని టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద పట్టాభి మీడియాతో మాట్లాడారు.
స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు క్షేత్రస్థాయిలో పరిశీలించలేదని శరత్ అసోసియేట్ నివేదికలో పొందుపర్చిందని... ఆ విషయాన్ని గమనించలేదా అంటూ ప్రశ్నించారు. ఉండవల్లి పిటిషన్‌లోని వాస్తవాలను ప్రజలు గమనించాలని పట్టాభి పేర్కొన్నారు. ఉండవల్లి.... జగన్‌పై వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై తలుపు చెక్కతో.. జగన్ పై మాత్రం తమలపాకు చెక్కతో కొడతారని అన్నారు. జగన్ పై సీబీఐ 11 ఛార్జీషీట్లు దాఖలు చేసి 10 ఏళ్లు అయినా ఉండవల్లి ఎందుకు మాట్లాడటం లేదని.. పట్టాభి ప్రశ్నించారు. నిజాలన్నీ పిటిషన్‌లోనే ఉన్నా తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.