TDP Leader Lokesh Fire on YCP Govt: 'సముద్ర గర్భంలో, అంతరిక్షంలో కూడా 144 సెక్షన్ అమలుచేసేలా.. వైసీపీ తీరు ఉంది': లోకేశ్ - ఏపీ రాజకీయ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 5:46 PM IST
|Updated : Sep 24, 2023, 6:52 AM IST
TDP Lokesh Fire on YCP Govt: బ్రిటీష్ పాలనకు మించి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం.. ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకి మద్దతుగా చేస్తున్న దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలపై కేసులు పెట్టడం.. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిపడ్డారు. టీడీపీ అధినేతకు సంఘీభావంగా సముద్ర తీరంలో సైకత శిల్పం ఏర్పాటు చేసిన వారిపైనా కేసు పెట్టడం లాంటి చర్య దేశంలో మరెక్కడా జరిగి ఉండదన్నారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం తీరు చూస్తుంటే.. సముద్ర గర్భంలో, అంతరిక్షంలో, భూగర్భంలో కూడా 144 సెక్షన్, 30పోలీస్ యాక్ట్ అమలు చేసేలా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కును కాదని చెప్పే అధికారం.. ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీశారు. పొరుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలపై లేని నిషేధం ఏపీలోనే ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో లేని నిర్బంధాలు ఏపీలో ఎందుకో ప్రభుత్వం సమాధానం చెప్పగలదా అని నిలదీశారు. ప్రజల నుంచి పుట్టిన ఉద్యమాన్ని అక్రమ కేసులతో అడ్డుకోలేరని స్పష్టం చేశారు.