kanna lakshminarayana వచ్చేది టీడీపీ ప్రభుత్వమే.. ప్రజలు అవకాశం కోసం చూస్తున్నారు: టీడీపీ నేత కన్నా
kanna lakshminarayana comments: ముఖ్యమంత్రి జగన్ ప్రజలను హింసించి పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో ఓ సైకో పాలన సాగుతోందని.. ప్రజలంతా సరైన సమయం కోసం చూస్తున్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు.. టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నారా లోకేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మంగళగిరి వాలీబాల్ లీగ్ ముగింపు కార్యక్రమానికి కన్నా లక్ష్మీనారాయణ, మాచర్ల నియోజకవర్గ నాయకులు బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వాలీబాల్ టోర్నమెంట్లో విజయం సాధించిన నిడమర్రు జట్టుకు కన్నా లక్ష్మీనారాయణ బహుమతి అందజేశారు.
తన 50 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో లోకేశ్ లాంటి నాయకుడిని చూడలేదని కన్నా అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా.. లోకేశ్ సొంత నిధులతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కన్నా కొనియాడారు. సైకో ముఖ్యమంత్రికి ఒక్క నిమిషం కూడా ప్రజలను పాలించే హక్కు లేదని మండిపడ్డారు. యువతకు సరైన ఉపాధి లభించాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు.
నాపై కుట్ర పన్నారు: బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించేందుకు అప్పట్లో వైసీపీ నేతలు కుట్ర పన్నారని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వైసీపీ అక్రమాలు, సీఎం జగన్ అరాచకాలపై ప్రశ్నించినందుకే తనపై తప్పుడు వార్తలు రాయించారన్నారు. 2019 ఎన్నికల్లో నిధుల వినియోగంలో తన పాత్ర లేదని.. దానిపై ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు వివరించారు. 20 కోట్లు రూపాయలు కాజేశారని అంబటి వంటి చిల్లర మనుషులు మాట్లాడటం దారుణమన్నారు. వైసీపీ రాక్షస పాలనను అంతం చేసేందుకు తెదేపాలో చేరినట్లు స్పష్టం చేశారు.