kalava srinivasulu రెండేళ్ల క్రితం చెప్పిన హామీలే మళ్లీ చెప్పారు.. సీఎం జగన్ సభపై టీడీపీ నేత కాలవ విసుర్లు - కాలవ శ్రీనివాసులు
Kalava Srinivasulu Fires on CM Jagan: రాయలసీమ ప్రాంత ప్రజలను ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారని టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. సీఎం సభలో మద్యం ఏరులై పారిందన్నారు. లేపాక్షి నాలెడ్జి హబ్ భూములపైన వైసీపీ నేతలు కుంభకోణాలు చేసి డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా.. జీడిపల్లి, బీటీపీ పథకం పనులు ఒక్క అడుగు ముందు పడలేదని ఆరోపించారు. రెండేళ్ల కిందట జగన్ సర్కార్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కి.. మరోసారి కళ్యాణదుర్గం సభలో రూ. 208 కోట్లు విడుదల చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 2021 జులై 8న అనంతపురం జిల్లా రాయదుర్గం సభలో బీటీపీ - జీడిపల్లి పథకం భూసేకరణ పనులను 60 రోజుల్లో పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని జగన్ను ప్రశ్నించారు. తీరా రెండేళ్లు గడిచాక భూసేకరణ పనులకు 208 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే.. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాలు కాలిన పిల్లిలాగా చప్పట్లతో ఆనందించడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు చెప్పే మాటలకు.. వాస్తవానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సభలో తెల్లవారి నుంచి ఉన్న పోలీసులకు సరైన అల్పాహారం కూడా అందించలేని ప్రభుత్వం వైసీపీ అని మండిపడ్డారు. జగన్ సభకు బస్సుల్లో తరలించిన డ్వాక్రా మహిళలకు అట్ట ముక్కలపై భోజనం పెట్టిన వైసీపీ సర్కార్ ను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు.
TAGGED:
సీఎం జగన్పై విమర్శలు