TDP Leader Kalava Srinivasa Rao on Power Cuts in State: "రాష్ట్రంలో కరెంట్ కోతలు.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి" - అనంతపురంలో చంద్రబాబు పర్యటన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 2:06 PM IST
TDP Leader Kalava Srinivasa Rao on Power Cuts in State :రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని ఓట్లేసి గెలిపించినందుకు అప్రకటిత విద్యుత్ కోతలతో అందరికీ నరకం చూపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురంలో కాలవ శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు విద్యుత్ ఉప కేంద్రాలను ముట్టడిస్తున్న పరిస్థితితో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఆయన విమర్శించారు. ప్రణాళిక లేకపోవటం, అవినీతి కారణంగా ప్రజల అవసరాల మేరకు జగన్ విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నారని ఆయన ఆరోపించారు.
బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ప్రారంభం :టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5న అనంతపురం జిల్లా పర్యటనకు (Chandrababu Visit to Anantapur District) వస్తున్నారని తెలిపారు. "బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమం (Babu Surety Future Guarantee Program) రాయదుర్గం నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తమ అధినేత చంద్రబాబు నాలుగు రోజుల పాటు అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో "బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమంలో పాల్గొంటారని కాలవ శ్రీనివాసులు చెప్పారు.