TDP Leader Chintamaneni Prabhakar fires on YCP Leaders: వైసీపీ నేతలపై చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం.. - chintamaneni Prabhakar news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 10:50 AM IST
TDP Leader Chintamaneni Prabhakar fires on YCP Leaders :తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. చంద్రబాబు మీద రాజకీయ కక్షతోనే స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.
చంద్రబాబు స్కిల్ కేసుపై క్వాష్ పిటిషన్ కొట్టేస్తే.. వైఎస్సార్సీపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు. మంత్రి బొత్స సత్య నారాయణ ఏం మాట్లాడతారో ఆయన పక్కోడికే అర్థం కాదని ఎద్దేవా చేశారు. కోర్టుల మీద గౌరవం పెరిగిందంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అంటున్నారని, అంటే ఇప్పటి వరకు ఆయనకు కోర్టుల మీద గౌరవం లేదా అని ప్రశ్నించారు. గవర్నర్ వెంటనే చెల్లుబోయినను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వైసీపీ నేత పేర్ని నాని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో (AP Skill Development Case) తప్పు జరిగిందనే ఆధారాలని ఇప్పటి వరకు ఎందుకు చూపలేకపోయారో చెప్పాలన్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని కోర్టు చెప్పిందా అని ప్రశ్నించారు. రాజకీయంగా జగన్ అండ్ పార్టీ సజీవ సమాధి అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
టీడీపీకి ఓట్లేసి.. వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. 140 మంది సాక్షులను విచారించి.. 4 వేల డాక్యుమెంట్లను సీఐడీ సేకరించిందనడాన్ని తప్పుబట్టారు. రాత జగనుదే.. పెన్నూ జగనుదే అయినప్పుడు ఏమైనా రాస్తారని ఆయన అన్నారు.