TDP Chinarajappa Comments: "వాలంటీర్లతో ఓటర్ వెరిఫికేషన్ చేయించేలా సీఎం కుట్ర" - TDP Leader Chinarajappa
TDP Leader Chinarajappa on Voter Verification: ఈ నెల 21నుంచి జరిగే ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియలో బీఎల్ఓ పేరిట వాలంటీర్లనే పంపి సమాచారం సేకరించే కుట్రకు ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి తెరలేపారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. చంద్రబాబు పిలుపు మేరకు ఓటరు పరిశీలన ప్రక్రియలో తెలుగుదేశం నేతలంతా పాల్గొని కుట్రలను భగ్నం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువైన ఓటు హక్కును కూడా జగన్మోహన్ రెడ్డి కాలరాస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 30 లక్షల ఓట్లు తొలిగించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని లక్షల ఓట్లు తెలుగుదేశం సానుభూతిపరులవి తొలగించేశారని అన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సేకరించి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీలో కుమ్ములాటలు ఉన్నాయన్నారు. నెల్లూరులో మొదలైన ఈ కుమ్ములాటలు తూర్పుగోదావరి జిల్లా వరకూ చేరాయన్నారు. మంత్రి సమక్షంలో జరిగిన గొడవతోనే వైఎస్సార్సీపీ వైస్ ఛైర్మన్ ఆత్మాహత్యాయత్నం చేశారని ఆరోపించారు. ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించటానికి సిద్ధమయ్యారు.. కాబట్టి వైఎస్సార్సీపీ కుమ్ములాటలతో తమకు పని లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల ఓట్లని కాకుండా దొంగ ఓట్లు నమ్ముకున్నాడు కాబట్టే అక్రమాలకు తెరలేపాడని చినరాజప్ప దుయ్యబట్టారు.