ప్రతి స్కీమ్‌లోనూ స్కామ్.. నాలుగు లక్షల కోట్లు మింగేశారు: చంద్రబాబు - CHANDRABABU SPEECH
Chandrababu Naidu Comments on YS Jagan: సీఎం జగన్ ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్‌లోనూ స్కామ్ ఉంటుందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో 2 లక్షల కోట్లు ప్రజలకు పంచానని చెబుతున్న సీఎం జగన్, మంత్రులు.. అంతకు రెట్టింపు దోచుకున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా ఉన్న జగన్.. తనకు తాను పేదలకు ప్రతినిధిగా ప్రకటించుకోవడం మహా విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వ పాలన అడుగడుగునా అరాచకం, విధ్వంసం, అక్రమాలతో సాగుతోందన్నారు. ఆఖరికి గంజాయిలోనూ సీఎంకు వాటా ఉందన్న చంద్రబాబు.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన చరిత్రహీనుడు జగన్ అని విమర్శించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తొలిరోజు పర్యటన అర్ధరాత్రి దాటే వరకూ జన నీరాజనాల మధ్య కొనసాగింది. బందరు పోర్టు నిర్మాణo కోసం ప్రజాపోరాటానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని చంద్రబాబు మచిలీపట్నం బహిరంగ సభలో పిలుపునిచ్చారు. విజయవాడ నుంచి బందరు వరకు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జనం పోటెత్తారు. 42డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా వేలాది మంది రహదారులపైకి వచ్చి.. జయహో చంద్రబాబు అంటూ నినాదాల మోత మోగించారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకూ.. జాతీయ రహదారిపై అడుగడుగునా.. ప్రతి గ్రామం వద్దా.. తెదేపా కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు.. బారులు తీరి మరీ జయజయధ్వానాలు పలికారు. దారిపొడుగునా పూలను జల్లుతూ.. క్రేన్లతో గజమాలలను వేలాడదీస్తూ వేలాది మంది తరలివచ్చి చంద్రబాబుకు అపూర్వ స్వాగతం పలికారు. దారిలో ఎక్కడికక్కడ మహిళలు చంద్రబాబు వాహనాన్ని ఆపి ఆయనకు హారతి పట్టారు. జాతీయ రహదారి మొత్తం జనంతో నిండిపోవడంతో.. ర్యాలీ చాలా నెమ్మదిగా సాగింది. చంద్రబాబు వాహన శ్రేణి వెనుక, ముందు వేలాది మంది యువత ద్విచక్రవాహనాలు, కార్లతో ర్యాలీగా సాగారు. మధ్యాహ్నం 3.45గంటలకు విజయవాడలో ఆరంభమైన చంద్రబాబు ర్యాలీ.. రాత్రి 9:30గంటలకు మచిలీపట్నం చేరుకుంది. జాతీయ రహదారిపై ఇసుక పోస్తే రాలనంత మంది జనం నిండిపోవడంతో.. వాహన శ్రేణి ముందుకు కదిలేందుకు చాలా కష్టమైంది. రాత్రి 11:30గంటల సమయంలో బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వైకాపా విధానాలను తూర్పారబట్టారు. వైకాపా ఉంటే రాష్ట్రం అంథకారమేనని హెచ్చరించారు.
తాజా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆకాశం వదిలి భూమి మీద తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకునే పేటెంట్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డని దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వం పోతే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ లేదన్న ఆయన.. కార్యకర్తల అండ ప్రజల మద్దతుతో ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబుకు.. ప్రజలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. దారిపొడవునా ఎదురేగి ఆహ్వానం పలకడంతో.. పర్యటన చాలా ఆలస్యంగా సాగింది.