నరసరావుపేటలో హై టెన్షన్.. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ అరవింద్‌బాబు హౌస్ అరెస్టు - chadalavada Aravindbabu house arrest
TDP LEADER CHADALAVADA ARAVIND BABU HOUSE ARREST : తెలుగుదేశం నేత, పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్ చదలవాడ అరవిందబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నరసరావుపేటలోని ఆయన నివాసం నుంచి బయటకు రానీయకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికు చదలవాడ అరవింద బాబు సవాలు విసిరారు. నియోజకవర్గంలో MLA గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమాలపై సాక్ష్యాధారాలతో.. కోటప్పకొండలో ఉగాది రోజున ప్రమాణం చేస్తానని చదలవాడ అరవిందబాబు ప్రకటించారు. కోటప్పకొండకు రావాలని కార్యకర్తలకూ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయన కోటప్పకొండకు వెళ్లకుండా ముందస్తు చర్యలు చేపట్టిన రెండో పట్టణ పోలీసులు.. గృహనిర్బంధం చేశారు. అయితే.. కార్యక్రమాన్ని నిర్వహించి తీరతామని అరవిందబాబు తేల్చి చెప్పారు. నరసరావుపేట తెలుగుదేశం కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
"గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమ ఆస్తులకు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు ధైర్యం ఉంటే ముందుకు రండి. వాటిని బయటపెడతాం. గోపిరెడ్డి అవినాతి, అక్రమాలపై విచారణ చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశాం. ఉగాది పూజ తర్వాత కోటప్పకొండకు వెళ్లి.. మా దగ్గర ఉన్న ఆధారాలను దేవుని ముందు పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం"-చదలవాడ అరవింద్ బాబు