వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం: బీటెక్ రవి - chandrababu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 9:59 PM IST
BTech Ravi participated in Babu Surety Bhavishyathuku Guarantee: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో నిర్వహించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. పులివెందులలో భరత్ అనే వ్యక్తి లైసెన్స్ పిస్టల్‌తో దిలీప్ అనే యువకుడిని కాల్చి చంపాడని, ఈ ఘటన పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని రవి ఆరోపించారు.
అంతకుముందే తుమ్మలపల్లి చెందిన విశ్వనాథరెడ్డి అనే వ్యక్తిని భరత్ యాదవ్ బెదిరించే సమయంలో ఒక బుల్లెట్ వేస్ట్ అయిందని, ఆ బుల్లెట్ కాని ఉంటే ఆ ఘర్షణలో మహబూబ్ బాషా అనే వ్యక్తి కూడా మృతి చెంది ఉండేవాడని అన్నారు. హత్య చేసినట్లు సీసీ ఫుటేజీలో క్లియర్‌గా ఉన్నా అతనికి బెయిల్ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని పోలీసులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి బెయిల్‌కు పోలీసులు సహకరించారంటే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. సమాజంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలంటే పోలీసుల పాత్ర బాగుండాలని బీటెక్ రవి హితవు పలికారు.