Bonda Uma on Amaravati స్వార్ధ ప్రయోజనాల కోసం పోలీసులను పావుగా వాడుకుంటున్న సీఎం..టీడీపీ నేత బొండా
TDP Leader Bonda Uma on Amravati Lands: రాజధాని అమరావతిని సీఎం జగన్ మోహన్ రెడ్డి పథకం ప్రకారం నాశనం చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. భూములు ఇచ్చిన రైతులపై పోలీసుల దాష్టికం దుర్మార్గమని మండిపడ్డారు. డీఎస్పీ పోతురాజు.. రైతుల్ని, మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన భూమిని ఆర్5 జోన్‌గా మార్చడం మూర్ఖత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతిపై కక్ష సాధింపులో పోలీసుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని వర్గాల వారు నివాసముండేలా పేదలకు 5శాతం భూమిని టీడీపీ ప్రభుత్వం రిజర్వ్ చేసిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సెంటు పట్టా హడావుడి రాజకీయ ప్రయోజనం కోసమే అని విమర్శించారు. పోలీసులను పావులుగా వాడుకోవడం తప్ప.. వారి సంక్షేమం మాత్రం సీఎం జగన్‌కు పట్టదన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలీసులను జగన్ ఇష్టారీతిగా వాడుకుంటున్నారని విమర్శించారు. రేపు సీఎం ఇచ్చే సెంటు భూమి పట్టాలను తీసుకోవడానికి జనం ముందుకు రాకపోయినా.. బలవంతంగా తీసుకొస్తున్నారని ఆరోపించారు.