చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నేత అశోక్ గజపతిరాజు - చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2023, 9:31 AM IST
TDP Leader Ashok Gajapathi Raju CBN Release: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నేతగా తన విధులు నిర్వర్తించకుండా.. ప్రభుత్వం 52 రోజుల పాటు జైల్లో పెట్టి ఆటంకం కలిగించిందని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. చంద్రబాబు బెయిల్పై విడుదలైన సందర్భంగా అశోక్ గజపతిరాజు బంగ్లాలో టీడీపీ నాయకులు మిఠాయిలు పంచుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీయాలనే.. విచారణ పేరుతో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. 52 రోజుల పాటు జైల్లో ఉంచడం వల్ల ఏం సాధించారని, నేరం చేశారని నిరూపించలేదని, ఇంకా విచారణ పేరుతో కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇంకా ఛార్జిషీట్ కూడా నమోదు చేయలేదన్నారు. చేతకాని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తుందని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని శాశ్వతంగా పాడుచేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించగా.. దాని నుంచి దేవుడు కాపాడాడని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నాయకుల అహం తగ్గించి సేవాభావం పెరగాలని ఆశాభావం వ్యక్తంచేశారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం, విజయనగరం పైడితల్లి అమ్మవారి పండగ.. రెండూ ఒకే రోజు జరగడం శుభపరిణామమని అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన ప్రజలకు అశోక్ గజపతిరాజు ధన్యవాదాలు తెలిపారు.