Allegations on YCP MLA Dwarampudi: పోర్టు భూముల్ని ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారు: కొండబాబు - ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
TDP Leaders Allegations on YCP MLA Dwarampudi: కాకినాడలో 45 కోట్ల రూపాయల విలువైన పోర్ట్ భూమిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరులు మట్టి కప్పేసి కబ్జా చేస్తున్నారని తెలుగుదేశం మాజీ ఎమ్మల్యే కొండబాబు ఆరోపించారు. కస్టమ్స్ కార్యాలయం వెనకాల ఉన్న పోర్ట్ భూముల్ని ద్వారంపూడి అనుచరులు గ్రావెల్‌తో పూడ్చేశారని చెప్పారు. కబ్జా కార్యక్రమం దర్జాగా సాగుతున్నా.. పోర్ట్ అధికారి ధర్మశాస్త్ర వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మత్స్యకారులు జీవనోపాధి కోసం కుంభాభిషేకం రేవు కోసం పోరాడితే 31 మందిపై కేసులు పెట్టారని.. 45 కోట్ల రూపాయల భూ కబ్జాపర్వంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. తెలుగుదేశం నాయకులతో కలిసి కొండబాబు గ్రావెల్‌తో నింపేసిన పోర్టు భూముల్ని పరిశీలించారు. కబ్జా పర్వంపై ధర్మశాస్త్రకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అక్రమార్కులకే మద్దతుగా నిలిచారని కొండబాబు ఆరోపించారు. పోర్టు ఆస్తులను కాపాడాలని పోర్టు అధికారులకు లేదని.. కేవలం ఎమ్మెల్యే ద్వారంపూడి చెప్పినట్లుగానే వింటున్నారని ఆరోపించారు.