TDP Ex Minister Bhuma Akhila Priya Hunger strike: 'రాజన్న పాలన తెస్తానని చెప్పి.. రాక్షస పాలన తెచ్చారు' - టీడీపీ కామెంట్స్ ఆన్ వైసీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2023, 9:04 PM IST
|Updated : Sep 22, 2023, 2:55 PM IST
TDP Ex Minister Bhuma Akhila Priya Hunger strike: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఇటీవల నంద్యాల జిల్లాలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ.. గురువారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు..అదే ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
Bhuma Akhila Priya Comments: ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబునాయుడుపై కక్ష సాధింపుతోనే అరెస్ట్ చేశారని.. భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వైసీపీ ప్రభుత్వ పైశాచికానికి నిదర్శనం అని ఆమె దుయ్యబట్టారు. కక్షపూరితంగానే చంద్రబాబును పిటీ వారెంట్లతో జైల్లో పెట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆయనను అరెస్ట్ చేసిన ప్రదేశంలోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు ఆమె తెలిపారు. 'చంద్రబాబు వయసుకు సైతం గౌరవం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. రాష్ట్రంలో కక్ష్యసాధింపు చర్యలో భాగంగానే అరెస్ట్‌లు జరుగుతున్నాయి. రాజన్న పాలన తెస్తానని.. రాక్షస పాలనను తీసుకువచ్చారు' అని అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.