TDP Councillor Protest In Council Meeting : వార్డు అభివృద్ది గురించే నా ఆవేదన..! కళ్లకు గంతలతో టీడీపీ కౌన్సిలర్ నిరసన - శ్రీ సత్య సాయి జిల్లా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2023, 7:38 PM IST
TDP Councillor Protest In Council Meeting : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం కౌన్సిల్ సమావేశంలో 36 వ వార్డు కౌన్సిలర్ భారతి తన వార్డులో అభివృద్ధి జరగడం లేదంటూ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. కళ్లు, నోటికి గంతలు కట్టుకొని సమావేశంలో కూర్చుంది. పలుమార్లు అధికారులు చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చినా అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లో టీడీపీ మహిళా కౌన్సిలర్ భారతి నిరసన చేపట్టడంతో.. అధికార పార్టీ వైసీపీ కౌన్సిలర్లకు టీడీపీ కౌన్సిలర్లకు ఈ విషయంపై మాటల యుద్ధం కొనసాగింది. కౌన్సిల్ సమావేశం ఆరంభం నుంచి ముగిసేంత వరకు... కౌన్సిలర్ గంతలను విప్పకుండా నిరసన కొనసాగించింది. కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్లు సైతం తమ వార్డులోని సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ప్రజల్లో ఎలా తిరగాలంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. నిరసన తెలిపిన కౌన్సిలర్ భారతి మాట్లాడుతూ.. మా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇచ్చిన ధైర్యంతో నిరసన తెలిపానని అన్నారు. 36వ వార్డులో ఇప్పటివరకు జీరో అభివృద్ధి జరిగిందని తెలిపారు. అధికార పార్టీ కౌన్సిలర్లు పబ్లిసిటీ కోసం ఇలా చేశావని విమర్శించడం తగదని అభివృద్ధి జరగకపోవడంతోనే నిరసన తెలపాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా తన వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు కోసం అధికారులు ఛైర్‌పర్సన్ దృష్టి పెట్టాలని కోరారు.