Srivani trust శ్రీవాణి ట్రస్ట్ శ్వేతపత్రంలో అన్నీ అవాస్తవాలే.. మిగిలిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లింది: టీడీపీ - Dundi Rakesh Accusations
Dundi Rakesh Accusations on Srivani Trust: టీటీడీని వ్యాపార సంస్థగా మార్చరని తెలుగుదేశం వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేశ్ ఆరోపించారు. తిరుమల కొండకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనాన్ని దుర్లభం చేస్తున్నారని మండిపడ్డారు. కొండపై గదుల అద్దెలు, లడ్డూల ధరలు పెంచారన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ఏర్పాటుచేసిన శ్రీవాణి ట్రస్ట్ చట్టవిరుద్ధమని ఆరోపించారు. శ్రీవారి దర్శనానికి ఇప్పటికే వివిధ రకాల టికెట్లు అందుబాటులో ఉండగా.. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో దర్శనానికి రూ.10వేలతో ప్రత్యేకంగా టికెట్ పెట్టారని గుర్తు చేశారు. దీని ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేశారన్నారు. శ్రీవాణి ట్రస్ట్‌పై టీటీడీ విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్నీ అవాస్తవాలు చెప్పారని.. నాలుగేళ్లలో శ్రీవాణి ట్రస్ట్ కు రూ.1500 కోట్లు రాగా కేవలం రూ.861 కోట్లే వచ్చాయని వివరించారని పేర్కొన్నారు. మిగిలిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగం విషయంలో గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నట్లుగా మాజీ మంత్రి వెల్లంపల్లి తీరు ఉందని దుయ్యబట్టారు.