టికెట్ ఇవ్వకపోయినా అధినేత ఆదేశాలు తప్పకుండా పాటిస్తా: టీడీపీ ఎంపీ కేశినేని నాని - Vijayawada MP Ticket
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 10:48 AM IST
TDP Clarification to Kesineni Nani on MP Ticket:వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్‌పై ఎంపీ కేశినేని నానికి తెలుగుదేశం అధిష్టానం స్పష్టత ఇచ్చింది. బెజవాడ ఎంపీ టిక్కెట్టును ఈ సారి వేరే వారికి కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఇదే విషయాన్ని ఎంపీ కేశినేని నాని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ఇతరులకు ఇవ్వాలని తెలుగుదేశం అధిష్టానం నిర్ణయించిందని, పార్టీ వ్యవహారాల్లోనూ ఎక్కువ జోక్యం చేసుకోవద్దన్నది చంద్రబాబు మాటగా ఆలపాటి రాజా, నెట్టం రఘురామ్, కొనకళ్ల నారాయణలు తనతో చెప్పినట్లు కేశినేని నాని ఫేస్బుక్లో పేర్కొన్నారు.
అధినేత ఆదేశాలు శిరసా వహిస్తానని వెల్లడించారు. జనవరి 7న తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్‌ఛార్జ్‌గా చంద్రబాబు నియమించారని చెప్పారు. తిరువూరు సభ విషయంలోనూ తనను కలగ చేసుకోవద్దన్నది చంద్రబాబు మాటగా నేతలు చెప్పినట్లు నాని తెలిపారు. తిరువూరు సభ ఏర్పాట్ల బాధ్యతను కేశినేని చిన్నీకి అప్పగించారు. తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ ఎంపీ టికెట్ ఆశిస్తున్న కేశినేని చిన్నీ గత కొంతకాలంగా పార్లమెంట్ పరిధిలో రాజకీయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు.