'మీకు మనసెలా వచ్చింది జగన్..! సీఎం జగన్‌కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్' - టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఈరోజు వార్తలు
Chandrababu Naidu Selfie Challenge to CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమాల వేదికగా మరోసారి సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. ''దివ్యాంగురాలైన (విభిన్న ప్రతిభావంతురాలైన) సీమ పర్వీన్‌కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మీకు మనసెలా వచ్చింది..? పద్దెనిమిది ఏళ్ల వయస్సు వచ్చినా కూడా ఇంకా తల్లిదండ్రులు చేతులపైనే పెరుగుతున్న పర్వీన్ (ఆ బిడ్డ) పెన్షన్ తొలగిస్తారా..? ఆ బిడ్డ ఇంట్లో మూడు వందల యూనిట్ల కరెంట్ వాడారని ఆమెకు వచ్చే పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా..? పెన్షన్‌కు ఆనాడు పర్వీన్ అర్హురాలైతే, ఈనాడు అనర్హురాలు ఎలా అయ్యింది..? దాదాపు తొంభై శాతం వైకల్యం ఉన్న పర్విన్‌కు నిబంధనల పేరుతో ఏళ్లుగా వస్తున్న పెన్షన్‌ను తొలగించడమే మీ మానవత్వమా..? నిజం చెప్పాలంటే వైకల్యంతో ఉన్నది ఆమె కాదు.. మీరు, మీ ప్రభుత్వం'' అని ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంక్షేమమంటే ఇదేనా జగన్.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' అనే పేరుతో మూడు రోజులపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ప్రజలు, యువత, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో మచిలీపట్నంకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు సీమ పర్వీన్‌కు జగన్ ప్రభుత్వం పెన్షన్ తొలగింపుపై చంద్రబాబు ధ్వజమెత్తారు.
300 యూనిట్ల కరెంట్ వాడితే పెన్షన్ కట్ చేస్తారా..?బందరులో జరిగిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో వేదికపైకి పర్వీన్‌ను కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్‌కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చిందంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. పద్దెనిమిది ఏళ్ల వయస్సు వచ్చినా కూడా వైకల్యం కారణంగా ఇంకా ఆమె తల్లిదండ్రులు చేతులపైనే పెరుగుతుందని..ఆమెకు ఏళ్ల తరబడి వస్తున్న పెన్షన్‌ను ఎలా తొలగించారు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెెంట్ వినియోగం విషయంలో పర్విన్ ఇంట్లో మూడు వందల యూనిట్లు వాడారని పెన్షన్ కట్ చేయడం ఈ ప్రభుత్వం సంక్షేమమా అంటూ చంద్రబాబు విమర్శించారు. పెన్షన్‌కు నాడు అర్హురాలు, నేడు అనర్హురాలు ఎలా అయ్యిందని చంద్రబాబు ప్రశ్నించారు. దాదాపు తొంభై శాతం వరకు వైకల్యంతో ఉన్న ఆమెకు ప్రభుత్వ నిబంధనల పేరు చెప్పి పెన్షన్ తొలగించడం సీఎం జగన్‌కున్న మానవత్వమా..? అంటూ ఆరోపించారు. సంక్షేమ పథకాల్లో ఆంక్షలతో కోతలపై సమాధానం చెప్పాలంటూ సీఎం జగన్‌కు చంద్రబాబు ట్వీట్ చేశారు.