TDP Chief Chandrababu Chitchat "రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభంజనం ఖాయం".. విలేకరులతో చంద్రబాబు ఇష్టాగోష్టి - cbn Ishtagoshthi
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2023, 10:53 AM IST
TDP Chief Chandrababu Chitchat with Reporters: రోజురోజుకీ తెలుగుదేశం పార్టీకి ఆదరణ బాగా పెరుగుతుందని.. వైఎస్సార్ కాంగ్రెస్ సర్కార్‌ని ప్రజలు తీవ్రంగా ద్వేషిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. సర్వేల్లో కూడా అదే విషయం బయటపడుతోందని.. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభంజనమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో చంద్రబాబు ఇష్టాగోష్టి నిర్వహించారు. రాబోయే ఒకటి, రెండు నెలల్లో టీడీపీ గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించడానికి భయపడుతున్నారని.. లేదంటే టీడీపీకి ఎంత ఆదరణ ఉందనేది స్పష్టంగా తెలిసేదని వివరించారు. తెలుగు చిత్రాలకు జాతీయ అవార్డులు రావడంపై విలేఖరులతో ప్రస్తావించిన చంద్రబాబు.. పుష్ప సినిమాలో ఒక చోట తన ఫోటో ఉందని గుర్తు చేశారు. ఆ సినిమాలో చూపించిన కాలంలో తాను సీఎంగా ఉన్నారనే ఉద్దేశంతోనో, ఎర్రచందనం స్మగ్లర్లను కంట్రోలే చేసినందుకో తన ఫోటో పెట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దానికే వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.