యువగళం పాదయాత్ర విజయోత్సవ ముగింపు సభకు జగన్ ప్రభుత్వం బస్సులు ఇవ్వడం లేదు- అచ్చెన్నాయుడు - యువగళం పాదయాత్ర ముగింపు సభ సమావేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 17, 2023, 5:15 PM IST
TDP AP President Atchannaidu Fires on YSRCP Govt: వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రతిపక్షల సభలు అంటేనే బస్సులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల శంఖారావం సభ అని చెప్పినా, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన తెలిపారు. శ్రీకాకుళం టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈనెల 20వ తేదీన యువగళం పాదయాత్ర ముగింపు సభపై పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. అందరూ స్వచ్ఛందంగా సభకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అణచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని ఏది అని అడిగితే చెప్పలేని పరిస్థితికి పాలకులు తీసుకోచ్చారన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని మూడు రాజధానులని, ఈ నాలుగున్నర ఏళ్లుగా ఏమి సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని సాగునీటి వనరులను నాశనం చేశారని ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయ్యలేదని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమను కూడా ప్రభుత్వం తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భోగాపురం ఎయిర్ పోర్టు చూడడానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డితో సహా అందరూ అవినీతిలో కూరికిపోయారని విమర్శించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు చాలా మంది క్యూ కడుతున్నారన్నారు.