TDP LEADER FIRE ON CM: 'జీవీ రావు ఎవరో తెలియకుండానే సాక్షిలో బిజినెస్ ప్రోగ్రాంలకు ఆహ్వానించారా..?'
ANAM AGGRESSIVE COMMENTS ON CM: ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు జీవీ రావు ఎవరో తెలియకుండానే తమ సొంత సాక్షిలో బిజినెస్ ప్రోగ్రాంలు చేయించారా..? అని సీఎం జగన్‌ను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. తమ గురించి మంచిగా చెబితే సూపర్..! లేకుంటే వెధవ అని అంటారా..?ఇదెక్కడి న్యాయం అని సీఎంను ఆయన ఎద్దేవా చేశారు. దీంతో పాటు జీవీ రెడ్డి ఎలాంటివారో సీఎం సతీమణి భారతీరెడ్డి, సాక్షి ప్రతినిధులనే అడిగి తెలుసుకోవాలి మరి.. అని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. జీవీ రావును సీఎం జగన్ విమర్శించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఈనాడు- ఈటీవీలో రాసేవి అక్షర సత్యాలే కాబట్టే జగన్ చదువుతున్నారు.. చూస్తున్నారు అని ఆయన అన్నారు. దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జీవీ రావు ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా.. రెండు రోజుల కిందట ఈనాడులో జీవీ రావు ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో.. అప్పుల ఊబిలో ఏపీ చిక్కుకుందనీ, మేల్కొనకపోతే పెను ఉపద్రవం తప్పదని జీవీ రావు వ్యాఖ్యానించారు. అయితే జీవీ రావు ఇంటర్వ్యూ తాను చూశానని, ప్రభుత్వంపై బురద చల్లేందుకే.. ఇలాంటి డిబార్ దానయ్యలు పుట్టుకొస్తారని.. సీఎం జగన్ అన్నారు. కాగా జీవీ రావును సీఎం జగన్ విమర్శించడంపై స్పందించిన ఆనం పై వ్యాఖ్యలు చేశారు.